హయత్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్ లో సమస్యలు
సూపరిడెంట్ పై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి డిమాండ్
హయత్ నగర్: హయత్ నగర్ మండల ఆఫీస్ ఆవరణంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్య సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. స్థానికులు ఇబ్బందులు పడుతున్నట్లు పలు పత్రికల ద్వారా వెలుగులోకి రాగానే, జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి అకస్మాత్తుగా హాస్పిటల్ ను పర్యటించారు.మధ్యాహ్నం 12:00 గంటలకే సూపరిడెంట్ గారి రూమ్ తాళం వేసి ఉండటం గమనించి ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆయన, హాస్పిటల్ లో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. రోగుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఔట్సోర్సింగ్ మరియు శానిటేషన్ సిబ్బంది తాము కావాలనుకున్న విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సూపరిడెంట్ గారు ఉదయం వేలిముద్ర వేసుకుని వెళ్లిపోవడమే తన పని అయిందన్నట్టు వ్యవహరిస్తున్నారని, సమయపాలన పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.30 పడకల సామర్థ్యం ఉన్న హాస్పిటల్ లో 28 మంది రోగులు ఉన్నప్పటికీ, అవసరమైన 20 మంది డాక్టర్లకు బదులుగా కేవలం 5 మంది మాత్రమే విధుల్లో ఉన్నారని, దీనివల్ల రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదని పేర్కొన్నారు. సూపరిడెంట్ మరియు డాక్టర్ల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పారు.ఇలాంటి పరిస్థితులు కొనసాగితే సహించేది లేదని, సకాలంలో చర్యలు తీసుకోకపోతే ప్రజాప్రతినిధులుగా తాము మరో విధంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. సూపరిడెంట్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.ఈ పర్యటనలో డాక్టర్లు డా. దుర్గ, డా. పురుషోత్తం, నర్సింగ్ సిస్టర్ రిచల్, శానిటేషన్ సూపర్వైజర్ సందీప్, ఫార్మసిస్టులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అలాగే బీజేపీ నాయకులు ప్రమోద్ రెడ్డి, మోహన్ రెడ్డి, కడారి యాదగిరి యాదవ్, శ్యాంసుందర్ రెడ్డి, ఎల్లారెడ్డి, వెంకటరమణా గౌడ్, జయతేజ, సంపత్ గౌడ్, యాదగిరి గౌడ్, శేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments