జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష
రంగారెడ్డి జిల్లా : శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీ.ఎస్. చౌహాన్ లతో కలిసి యాసంగి ధాన్యం సేకరణపై మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈసారి రాష్ట్రంలో యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో వరి ధాన్యం సాగు అయిందని అన్నారు. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణను ఓ మహా యజ్ఞంలా భావిస్తూ, రైతుల నుండి ప్రభుత్వం పెద్ద ఎత్తున మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు. సన్నాలకు బోనస్ సైతం చెల్లించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 60.14 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, 129.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయని వివరించారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 8329 కొనుగోలు కేంద్రాల ద్వారా 70.13 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 49.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలను సేకరించడం జరిగిందన్నారు. గడిచిన మూడు సంవత్సరాలలో పోలిస్తే ఈసారి దాదాపు రెట్టింపు స్థాయిలో ధాన్యం సేకరణ జరుపుతున్నామని తెలిపారు. 2022-23 యాసంగిలో 25 .35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరుగగా, 2023 -24 లో 32 .93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయన్నారు. ఈ ఏడాది యాసంగికి సంబంధించి ఇప్పటికే 49 .53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయ్యిందని వివరించారు. ఇంకనూ రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెస్తున్నందున కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ముఖ్యంగా లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అన్నారు. ధాన్యం నిల్వ చేసుకునేందుకు వీలుగా ఇంటర్మీడియట్ గిడ్డంగులను గుర్తించాలని సూచించారు. అకాల వర్షాల వల్ల ధాన్యం నిల్వలు తడిసి పోకుండా వాతావరణ పరిస్థితుల గురించి క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ముందస్తుగానే రైతులకు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేయాలన్నారు. మరో రెండు వారాల పాటు ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగనున్న దృష్ట్యా, ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా సాఫీగా కొనుగోళ్లు పూర్తయ్యేలా అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి అవాంతరాలు లేకుండా పర్యవేక్షణ జరపాలని, నాణ్యమైన బియ్యం పంపిణీ జరిగేలా చూడాలన్నారు. కొత్త రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ మంజూరీలు తెలపాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బోగస్ కార్డులు జారీ కాకుండా పకడ్బందీ పరిశీలన జరపాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, డీఆర్డీఓ పిడి శ్రీలత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, డీఎస్ఓ, సివిల్ సప్లైస్ డీ.ఎం. గోపికృష్ణ, మార్కెటింగ్ శాఖ ఏ.డీ మహ్మద్ రియాజోద్దిన్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments