వనస్థలిపురంలో లఘు చిత్రాల ప్రదర్శన
వనస్థలిపురం శ్రీ శ్రీ కనకదుర్గ కళ్యాణ మండపంలో బుధవారం నాడు వనస్థలి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో లఘు చిత్ర ప్రదర్శన వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి వనస్థలి ఫిలిం సొసైటీ నిర్వాహకులు బీ.డి.ఎల్ సత్యనారాయణ, అజయ్ కుమార్, బ్రహ్మచారి, శ్యాం ప్రసాద్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రధాన అతిథులుగా విశ్రాంత హైకోర్ట్ జడ్జి జస్టిస్ బి. చంద్రకుమార్, దాశరథి ఫిలిం సొసైటీ అధ్యక్షుడు ఎస్. వినయ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యుడు డాక్టర్ మారం రాజు రామచంద్ర రావు, కనకదుర్గ ఆలయ కమిటీ వైస్ చైర్మన్ యుగంధర్ రెడ్డి, డైరెక్టర్ రామ్ రాంపల్లి, దర్శకులు వీమ్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ లఘు చిత్రాలను ప్రోత్సహించడానికి వనస్థలి ఫిలిం సొసైటీ చేస్తున్న కృషి ప్రశంసనీయం అన్నారు. యువతలో సృజనాత్మకతను పెంపొందించడం కోసం ఈ విధమైన కార్యక్రమాలు ఉపయోగపడతాయని, సమాజానికి పాజిటివ్ సందేశాలను అందించే మంచి ప్రయత్నం ఇది అని పేర్కొన్నారు. లఘు చిత్రాల ద్వారా సమాజంలోని సమస్యలను సృజనాత్మకంగా ప్రతిబింబించడం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావచ్చని చెప్పారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి నెలలో రెండు సార్లు, అంటే మొదటి బుధవారం మరియు మూడవ బుధవారం లఘు చిత్ర ప్రదర్శనలు ఇదే కళ్యాణమండపంలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం నాలుగు లఘు చిత్రాలను ప్రదర్శించామని చెప్పారు. లఘు చిత్రాల ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య అతిథులు, కాలనీ వాసులు, నటీనటులు, సాంకేతిక బృందం అందరికీ ధన్యవాదాలు తెలిపారు.వనస్థలి ఫిలిం సొసైటీ స్థాపన లక్ష్యం లఘు చిత్రాలను ప్రోత్సహించడం, యువ ప్రతిభను ప్రదర్శించే వేదికగా నిలవడం అని నిర్వాహకులు వివరించారు. ఈ సినిమాకు నిర్మాతగా ముందుకొచ్చి సహాయ సహకారాన్ని బ్రహ్మచారి అందిస్తున్నందుకు ఎంతో ఆనందదాయకమని అన్నారు. డైరెక్టర్ రామ్ రామ్ పల్లి సినిమా స్క్రీన్ తెరను అందిస్తున్నందుకు నిర్వాహకులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా మరింత మంది యువత ఈ రంగంలో ముందుకు రావాలని, తమ కథల ద్వారా సమాజానికి మంచి మార్గదర్శనం ఇవ్వాలని ఆకాంక్షించారు. లఘు చిత్ర ప్రదర్శన కోసం తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, కావున తమను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments