భారత్ టెలికాం 2025ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా: దేశ ఎగుమతుల సామర్థ్య ప్రదర్శన

భారత్ టెలికాం 2025ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా: దేశ ఎగుమతుల సామర్థ్య ప్రదర్శన

* భారత్ టెలికాం 2025లో ప్రపంచ టెలికాం లక్ష్యాలను ప్రదర్శించిన భారత్

* ‘‘మేం పల్లెలను మాత్రమే అనుసంధానించడం లేదు.. భవిష్యత్తును అనుసంధానిస్తున్నాం. మేం నిర్మించే ప్రతి టవర్, ప్రసారం చేసే ప్రతి బైట్ 1.4 బిలియన్ల మంది ప్రజలను అవకాశాలకు చేరువ చేస్తుంది’’: మంత్రి సింధియా

* ‘‘డిజిటల్ రంగంలో ఇతర దేశాలను అనుసరించే స్థాయి నుంచి అంతర్జాతీయంగా నాయకత్వం వహించే దేశంగా భారత్ ఎదగడం వెనుక ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దృఢ సంకల్పం ఉంది. ఈ సంకల్పమే ఆకాంక్షలను మౌలిక వసతులుగా, విధానాన్ని అభివృద్ధిగా మార్చింది’’: మంత్రి సింధియా

* ‘‘ప్రస్తుతం భారత్ మార్కెట్‌గా లేదా వినియోగదారుగా మాత్రమే తన స్థానాన్ని పరిమితం చేసుకోలేదు. ఆవిష్కర్తగా, భాగస్వామిగా, ప్రపంచస్థాయిలో నమ్మకమైన టెలికాం సేవలు అందించేదిగా నిలిచింది. మేడ్-ఫర్-ఇండియా అనే స్థాయి నుంచి మేడ్-బై-ఇండియా స్థాయికి కథ మారింది’’: డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్

* ఈ కార్యక్రమంలో పాల్గొన్న 35కి పైగా దేశాలకు చెందిన 130 మందికి పైగా ప్రతినిధులు

* 80కి పైగా ప్రముఖ భారతీయ టెలికాం, ఐసీటీ సంస్థలు వివిధ విభాగాల్లో వినూత్న ఆవిష్కరణలు, పరిష్కారాల ప్రదర్శన

‘‘భారత్ టెలికాం ఓ సదస్సు మాత్రమే కాదు – ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు, సమ్మిళిత వృద్ధి ద్వారా అంతర్జాతీయ అనుసంధాన వ్యవస్థ భవిష్యత్తును రూపొందించాలనే భారత్ సంకల్పాన్ని ప్రకటిస్తుంది’’ అని కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా అన్నారు. ఈ రోజు న్యూఢిల్లీలో ‘భారత్ టెలికాం 2025’ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆలోచనలు, ఆవిష్కరణ, సంకల్పం కలసి పనిచేసినప్పుడు, అవి  గందరగోళాన్నికాదు.. అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. ప్రపంచ సహకారం, అవకాశాలకు భారత్ టెలికాం అనుకూలమైనది’’ అని మంత్రి అన్నారు.

భారత్ టెలికాం 2025ను టెలికమ్యూనికేషన్ల విభాగం (డీవోటీ) సహకారంతో టెలికాం ఎక్విప్‌మెంట్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (టీఈపీసీ) నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం టెలికాం ఉత్పత్తుల తయారీ, సేవలు, ఎగుమతుల్లో ప్రపంచ కేంద్రంగా ఎదగాలనే భారత్ లక్ష్య సాధనలో కీలకపాత్ర పోషిస్తుంది. కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టెలికాం సేవల రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రతినిధులు, ఆవిష్కర్తల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ‘భారత్ టెలికాం 2025’ను నిర్వహిస్తారు. ఈ రంగానికి చెందినవారికి వేదికను అందించడమే కాకుండా, ప్రత్యేక అంతర్జాతీయ బిజినెస్ ఎక్స్‌పోను సైతం ప్రదర్శిస్తుంది.

ప్రగతిశీల సంస్కరణలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల మద్దతుతో టెలికాం ఎగుమతిదారుగా, ఆవిష్కరణల కేంద్రంగా పెరుగుతున్న భారత్ పాత్ర గురించి తన ప్రారంభోపన్యాసంలో మంత్రి సింధియా వివరించారు. ‘‘మేం పల్లెలను మాత్రమే అనుసంధానించడం లేదు.. మేం భవిష్యత్తును అనుసంధానిస్తున్నాం. మేం నిర్మించే ప్రతి టవర్, మేం ప్రసారం చేసే ప్రతి బైట్ 1.4 బిలియన్ల మంది ప్రజలను అవకాశాలకు చేరువ చేస్తుంది’’ అని మంత్రి సింధియా అన్నారు. ‘‘డిజిటల్ పరమైన అంశాల్లో ఇతర దేశాలను అనుసరించే స్థాయి నుంచి అంతర్జాతీయ డిజిటల్ రంగంలో నాయకత్వం వహించే దేశంగా భారత్ ఎదగడం వెనుక ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దృఢ సంకల్పం ఉంది. ఈ సంకల్పమే ఆకాంక్షలను మౌలికవసతులుగా, విధానాన్ని అభివృద్ధిగా మార్చింది’’ అని ఆయన అన్నారు.

‘‘కేవలం 22 నెలల్లో 99 శాతం గ్రామాలను 5జీకి అనుసంధానించాం. 82 శాతం జనాభాను ఈ నెట్వర్క్‌ పరిధిలోకి తీసుకువచ్చాం. 4,70,000 టవర్లను నిర్మించాం. ఇది పరిణామం కాదు. ఇది టెలికాం విప్లవం’’ అని ఆయన అన్నారు. ‘‘భారత్ వ్యాప్తంగా నిర్మించిన ఈ డిజిటల్ సదుపాయాలు సమాచార వ్యవస్థకు సంబంధించినవి మాత్రమే కాదు – మౌలిక వసతులకే మౌలిక సదుపాయాల వంటివి. ఇవి 1.4 బిలియన్ల మంది ప్రజలకు ఆరోగ్య సేవలు, విద్య, పరిపాలన, ఆర్ధిక అవకాశాలకు చేరువ చేస్తుంది’’ అన్నారు.

అంతర్జాతీయ డిజిటల్ శక్తి కేంద్రంగా భారత్ అసాధారణ రీతిలో ఎదుగుతోందని మంత్రి అన్నారు. ఇది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. 4జీ, 5జీ విభాగాల్లో ప్రపంచ వేగాన్ని అధిగమించి భారత్ ముందంజలో ఉందన్నారు. విస్తృత సంస్కరణలు, సాంకేతిక ఆవిష్కరణలు దేశ ప్రగతిపథాన్ని నిర్దేశిస్తున్నాయని తెలిపారు. 1990ల్లో ఖరీదైన, పరిమితమైన మొబైల్ సేవల నుంచి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం మార్కెట్‌గా, చౌకైన డేటా ప్రొవైడర్‌గా మారిన దేశ పరిణామ క్రమంలో టెలికాం రంగం పోషించిన కీలకపాత్రను శ్రీ సింధియా వివరించారు.

ఈ కార్యక్రమంలో కమ్యూనికేషన్ల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘‘ఒక దేశ అభివృద్ధి ప్రయాణంలో అంతర్జాతీయ స్థాయి చర్చల్లో పాల్గొనడం మాత్రమే కాకుండా.. వాటి గమనాన్ని నిర్దేశించే క్షణాలు కూడా ఉంటాయి. ఈ రోజు భారత్ మార్కెట్‌గా లేదా వినియోగదారుగా మాత్రమే తన స్థానాన్ని పరిమితం చేసుకోలేదు. ఆవిష్కర్తగా, భాగస్వామిగా, ప్రపంచస్థాయిలో నమ్మకమైన టెలికాం సేవలు అందించేదిగా నిలిచింది. మేడ్-ఫర్-ఇండియా అనే స్థాయి నుంచి మేడ్-బై-ఇండియా స్థాయికి కథ మారింది’’ అన్నారు.  

ప్రపంచ టెలికాం రంగంలో కీలకమైన మార్పులను భారత్ స్వీకరిస్తోందని, వినియోగదారుడి నుంచి సాంకేతికత రూపశిల్పిగా మారుతోందని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. దశాబ్దం క్రితం ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమం వల్లే ఈ పురోగతి సాధ్యమైందని తెలిపారు. దీనికి  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలు చేస్తున్న దూరదృష్టితో కూడిన ప్రభుత్వ విధానాలు సైతం సహకరించాయని పేర్కొన్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం, అభివృద్ధి చెందుతున్న స్పెక్ట్రమ్ నిర్వహణ, టెలికాం సాంకేతికతల అభివృద్ధి నిధి తదితర కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. దేశీయంగా తయారీ, ఎగుమతులు, ఆవిష్కరణల్లో పెరుగుదల గురించి వివరించారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ ఇప్పుడు కీలకపాత్ర పోషిస్తోందని, ప్రపంచంలో తయారవుతున్న ఐఫోన్లలో 15 శాతం భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొన్నారు. డిజిటల్ సార్వభౌమత్వాన్ని బలోపేతం చేయడానికి, 6జీ సేవల్లో ముందంజ, శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ, క్వాంటమ్ కమ్యూనికేషన్లపై దేశ భవిష్యత్ దృష్టిని వివరిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

టీఈపీసీ ఛైర్మన్ శ్రీ అర్నబ్ రాయ్ మాట్లాడుతూ.. ‘‘భారత స్వదేశీ టెలికాం వ్యవస్థ పరివర్తనాత్మక శక్తిని, ఈ రంగంలో మనం సాధించిన అసమాన వృద్ధిని, అంతర్జాతీయ టెలికాం పరిశ్రమలో ఆవిష్కరణలను భారత్ టెలికాం కార్యక్రమం ప్రదర్శిస్తుంది’’ అన్నారు. టెలికాం రంగంలో ఆవిష్కరణలను, తయారీని ప్రోత్సహించిన భారత ప్రభుత్వ వ్యూహాత్మక విధానాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే భారత్ టెలికాం ఎగ్జిబిషన్ 2025లో ఆవిష్కరణలను అన్వేషించాల్సిందిగా ప్రతినిధులను కోరారు.

నమ్మకమైన, విశ్వసనీయమైన టెలికాం వస్తువుల తయారీదారుగా, ఎగుమతుల గమ్యస్థానంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ టెలికాం 2025ను రూపొందించారు. టెలికాం పరికరాలు, ఐసీటీ సేవలు, తర్వాతి తరం డిజిటల్ సాంకేతికతల్లో పెరుగుతున్న దేశ సామర్థ్యాలను ఈ కార్యక్రమం ప్రదర్శిస్తుంది. 80కి పైగా ప్రముఖ భారతీయ టెలికాం, ఐసీటీ సంస్థలు వివిధ విభాగాల్లో వినూత్న ఆవిష్కరణలు, పరిష్కారాలను ప్రదర్శించాయి.

ఈ కార్యక్రమంలో 35కి పైగా దేశాలకు చెందిన ప్రభుత్వ విభాగాలు, ప్రైవేటు సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తూ 130 మంది విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 5జీ, ఆప్టికల్ ఫైబర్, బ్రాండ్‌బ్యాండ్ వసతులు, శాటిలైట్ కమ్యూనికేషన్, ఐవోటీ, ఏఐ-ఆధారిత వ్యవస్థలు తదితర అత్యాధునిక సాంకేతికతలపై ఎగ్జిబిషన్లు, కాన్ఫరెన్సులు, అత్యంత ప్రభావంతమైన బీ2బీ సమావేశాలు, వ్యూహాత్మక నెట్వర్కింగ్ కార్యక్రమాలు, నాలెడ్జి షేరింగ్ ఫోరమ్‌లు ఏర్పాటు చేశారు.

టీఈపీసీ గురించి:

భారత ప్రభుత్వ విదేశీ వాణిజ్య విధానం ప్రకారం 2009లో టెలికాం ఎక్విప్‌మెంట్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (టీఈపీసీ) ఏర్పాటయింది. టెలికాం వస్తువులు, సేవల ఎగుమతులను ప్రోత్సహించడంలో, సులభరతరం చేయడంలో ఈ సంస్థ కీలకపాత్ర పోషిస్తుంది. ఐసీటీ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, మౌలికవసతులను మెరుగుపరిచే ఉత్పత్తులు, వ్యవస్థల ఏకీకరణ, కన్సల్టెన్సీ, సేవా సదుపాయాలతో సహా మొత్తం టెలికాం వ్యవస్థకు ఆదేశాలు జారీ చేస్తుంది. పరికరాల తయారీదారులు, సిస్టమ్ ఇంటిగ్రేటర్లు, సర్వీస్ ప్రొవైడర్లు, టెలికాం రంగంలోని ఇతర సంస్థలకు టీఈపీసీ కీలకమైన వేదికగా పనిచేస్తుంది.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్
మేడ్చల్ వివాహ వేడుకల్లో బీసీ సంక్షేమ సంఘాం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వదించారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపల్ పట్టణ పరిధిలోని...
నాగోల్ లో సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు
పలు గ్రామాలలో ఘనంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
 అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ
చెత్త కుప్పలు ఎత్తడంలో నిర్లక్ష్యం ఎందుకు
మేడ్చల్ ఏ.సి.పి శ్రీనివాస్ రెడ్డి బదిలీ
రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న డి.ఆర్.డిఎ.పిడి.శ్రీలత